సాక్షర భారత్ స్థానే కొత్త పథకం
55లక్షల మందిని అక్షరాస్యులను చేయడం ఈ ఏడాది లక్ష్యం
దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘పఢ్‌నా లిఖ్‌నా అభియాన్’ పథకానికి శ్రీకారం చుట్టింది. పదేళ్ల పాటు కొనసాగిన సాక్షర భారత్‌ను రద్దుచేసిన కేంద్రం దాని స్థానంలో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో 55లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాలకూ లక్ష్యాలను నిర్దేశించింది. పథకానికి అవసరమయ్యే బడ్జెట్‌లో కేంద్రం 60 శాతం, మిగతాది రాష్ట్రాలు భరించాలి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. సాక్షర భారత్‌లో వాలంటీర్లకు గౌరవ వేతనం ఉండేది. కొత్త పథకంలో గౌరవ వేతనాలు ఉండవు. అమలులో పాఠశాలలు, కళాశాలలు, స్థానికసంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి.
మార్గదర్శకాలు...నిబంధనలు
- 4 నెలల వ్యవధిలో 120 గంటలపాటు చదువు నేర్పుతారు. తర్వాత జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక అక్షరాస్యత అంచనా పరీక్ష నిర్వహిస్తారు. 40 శాతం మార్కులు సాధిస్తే సర్టిఫికెట్ ఇస్తారు.
- పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయస్థాయిలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి, రాష్ట్రస్థాయిలో సీఎం/విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా జాతీయ, రాష్ట్ర అథారిటీలు ఉంటాయి.
- బీఈడీ, డీఈడీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులను స్టూడెంట్ వాలంటీర్లుగా నియమిస్తారు. ఒక్కొక్కరు 8-10 మందిని అక్షరాస్యులుగా మార్చాలి.
- గ్రామస్థాయిలో ప్రధానోపాధ్యాయుడిని విలేజ్ లిటరసీ సూపర్‌వైజర్‌గా, మరో ఉపాధ్యాయుడిని విలేజ్ లిటరసీ టీచర్‌గా నియమిస్తారు. గ్రామస్థాయిలో కార్యక్రమం అమలు బాధ్యత పంచాయతీదే.