రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ
కరోనా కల్లోల సమయంలో ఆత్మ నిర్భర భారత్ లక్ష్యంగా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయాల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుందని తెలిపారు. ఈ ఆర్ధిక ప్యాకేజీతో నిరుపేదలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సహా ప్రతి ఒక్కరికీ భరోసానింపుతామని అన్నారు. ఈ ప్యాకేజీ వివరాలను రేపటి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడిస్తారని చెప్పారు.
దేశంలో కరోనా పరిస్థితులపై నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. మంగళవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఇందుకోసం అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకొస్తామన్నారు. దేశ ప్రజలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగేలా రూ.20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీలో ప్రతి రూపాయి ప్రజలకు చేరేలా చూస్తామన్నారు. స్వయం సాధికారతతో అందరం ముందుకు నడిచేలా చర్యలు తీసుకంటామన్నారు. ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. సంక్షోభం నుంచి సరికొత్త భారతాన్ని నిర్మించుకోవాలి, దేశీయ, లోకల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. లోకల్ గా వస్తువుల ఉత్పత్తి, లోకల్ మార్కెట్లు, లోకల్ వస్తువుల కొనుగోలు వంటి వాటిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.