కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది...- భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్


భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. ప్రైవేట్ వినియోగం దారుణంగా పడిపోయిందని చెబుతూ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. అంటే, ఇప్పుడున్న 4.4 శాతం నుంచి రెపో రేట్ 4 శాతానికి తగ్గుతుందని శక్తికాంత దాస్ అన్నారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతకుముందు, మార్చి 27న కూడా ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేయడం రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను నిరర్థకంగా అటి పెట్టుకోకుండా ఉండేలా చేసేందుకు రివర్స్ రెపో రేటును కూడా 3.75 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఇప్పుడు మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంకా, మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థికరంగం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలల వ్యవధిలో ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసిన మూడో మీడియా సమావేశం.

ఆర్‌బీఐ గవర్నర్ ఇంకా ఏమన్నారు...

  • కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్టుబడుల ప్రవాహంపై గణనీయంగా ప్రభావం పడింది.
  • కోవిడ్-19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.
  • మార్చిలో భారత పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది.
  • దేశంలో ఆరు పెద్ద పారిశ్రామిక రాష్ట్రాలు రెడ్ జోన్లో ఉన్నాయి.
  • ఏప్రిల్‌లో తయారీరంగం ఎప్పుడూ లేనంత క్షీణత నమోదైంది.
  • మార్చిలో కాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 36 శాతం పతనం.
  • వినియోగ వస్తువుల ఉత్పత్తి 33 శాతం పడిపోయింది.
  • తయారీరంగంలో 21 శాతం తక్కువ వృద్ధి నమోదైంది.
  • దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
  • ఆహారధాన్యాల ఉత్పత్తితో పెరుగుదలతో ఆహార భద్రతకు భరోసా వచ్చింది. ఖరీఫ్‌లో పంట దిగుబడి 44 శాతం పెరిగింది.
  • మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు మార్చి 27న మూడు నెలల మారటోరియం ప్రకటించాం. లాక్ డౌన్ పొడిగించడంతో ఇప్పుడు దాన్ని దాన్ని మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నాం.
  • 2020-21లో భారత్ విదేశీ మారక నిల్వల్లో 9.2 బిలియన్ డాలర్ల వృద్ధి నమోదైంది. భారత విదేశీ మారక నిల్వలు ఇప్పుడు 487 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఈ రోజు ప్రకటించిన చర్యలకు ప్రధానంగా 4 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అవి:

  1. మార్కెట్ల పనితీరును మెరుగుపరుస్తూ ఎగుమతులు, దిగుమతులకు మద్దతు ఇవ్వడం
  2. రుణ సేవలకు ఉపశమనం అందిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం.
  3. వర్కింగ్ కాపిటల్‌ మెరుగు పరిచేందుకు నగదు లభ్యత పెంచడం
  4. రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఆర్థిక అడ్డంకులను తగ్గించడం
కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పిన శక్తికాంత దాస్, సిడ్బీ రుణాల మారటోరియంను కూడా మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28