విద్యార్థులకు ఇకపై రెండేళ్లకే ఎంసీఏ పట్టా..


ఇప్పటివరకు మూడేళ్లుగా ఉన్న ఎంసీఏ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఎంసీఏ కోర్సు వివరాలు, తాజా మార్పులు, ప్రవేశ విధానం, అవకాశాలపై ప్రత్యేక కథనం...
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి 1990వ దశకంలో మూడేళ్ల ఎంసీఏ కోర్సును ప్రవేశపెట్టారు. లేటెస్ట్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును రూపొందించారు. అందుబాటులో ఉన్న పలు సాఫ్ట్ వేర్‌ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్‌ను వేగంగా, సమర్థంగా నిర్వహించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ కోర్సు ప్రధానోద్దేశం. ఎంసీఏలో ప్రతి సబ్జెక్టు కూడా ప్రాక్టికల్స్‌తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నేర్చుకున్న థియరీని వెంటనే ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు. 

తాజా మార్పులు!
గతంలో ఎంసీఏ కోర్సులో బీఎస్సీ-ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా బీకామ్ తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులే ఎంసీఏలో ఎక్కువగా చేరుతున్నారు. వీరికి ఎంసీఏ మొదటి సంవత్సరంలోని ప్రాథమిక అంశాలతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అంతేకాకుండా బీఎస్సీ ఐటీ, సీఎస్, బీసీఏ తదితర కోర్సులు చేసిన వారు లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో సంవత్సరంలోనే చేరి.. అడ్వాన్స్‌డ్ స్థాయి సబ్జెక్టులను నేర్చుకుంటున్నారు. కానీ కళాశాలలు మాత్రం మూడేళ్ల కోసం తరగతి గదులను, అధ్యాపకులను సమకూర్చుకోవడం సమస్యాత్మకంగా మారింది. దీనిపై ఏఐసీటీఈకి అభ్యర్థనలు వెళ్లాయి. దాంతో విద్యార్థులకు, కళాశాలలకు ప్రయోజనం చేకూరేలా ఎంసీఏ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. కోర్సు సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. బోధన గంటలను తగ్గించలేదు. మొదటి సంవత్సరంలో బోధించే ప్రాథమికాంశాలు లేకుండా విద్యార్థులు ఎంసీఏ రెండో సంవత్సరంలోని ప్రధాన అంశాలనే నేరుగా నేర్చుకుంటారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. 

ప్రవేశ విధానం..
తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఐసెట్/టీఎస్ ఐసెట్)లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎంసీఏ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తారు. ఏదైనా డిగ్రీ/ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ ప్రవేశ పరీక్ష రాయొచ్చు. కానీ ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. 

మల్టిపుల్ ఛాయిస్‌ విధానంలో 200 ప్రశ్నలు, 200 మార్కులకు ఐసెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీలకు సంబంధించి మూడు సెక్షన్‌లు ఉంటాయి. 

అప్‌డేట్ అవ్వాలి..
ఎంసీఏ విద్యార్థులకు ప్రధానంగా అవకాశాలు కల్పించే రంగం.. సాఫ్ట్‌వేర్. ఈ రంగంలో టెక్నాలజీతో పూర్తికాలం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ పరంగా నూతనంగా వస్తున్న ఆవిష్కరణలు, కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి నిత్యం అప్‌డేట్‌గా ఉండాలి. ఏదైనా విషయాన్ని వేగంగా అవగాహన చేసుకునే నేర్పు, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయగలిగే లక్షణాలున్న విద్యార్థులు ఎంసీఏను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో.. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బృంద నిర్వహణ, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, ఇంటరాక్షన్ వంటివి కూడా అవసరమవుతున్నాయి. అంతేకాకుండా.. ఎంసీఏలో చేరాలనుకునే విద్యార్థులు నూతన టెక్నాలజీని సొంతంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం