ప్రైవేటు వర్సిటీలకు తెలంగాణ పచ్చజెండా
- 5 ప్రైవేట్ వర్సిటీలకు పచ్చజెండా
- గెజిట్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- కొత్త విద్యాసంవత్సరంలో తరగతుల ప్రారంభం
- గతంలో 9 వర్సిటీలకు ప్రాథమిక అనుమతి
రాష్ట్రంలో అయిదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వాటికి తుది అనుమతి సైతం మంజూరు చేసింది. సంబంధిత ఆర్డినెన్స్‌కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్(రాజపత్రం) జారీ చేసింది. గత ఫిబ్రవరిలో మొత్తం తొమ్మిది ప్రైవేట్ వర్సిటీల స్థాపనకు తాత్కాలిక అనుమతి(లెటర్ ఆఫ్ ఇంటెంట్) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో దానికి ఒక చట్టం రూపొందించాల్సి ఉంది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఆయా వర్సిటీల చట్టాల కోసం బిల్లు పెట్టాలని సర్కారు సమాయత్తమైంది. ఈ విషయమై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలోనూ చర్చించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. తాత్కాలిక అనుమతి పొందిన వాటిల్లో ప్రతిష్ఠాత్మక వర్సిటీలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రైవేట్ వర్సిటీల అనుమతులపై ఏర్పాటైన మంత్రిమండలి ఉపసంఘం.. గత నెలలో సమావేశమై చర్చించింది. కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 5 విశ్వవిద్యాలయాలకు మాత్రమే తుది అనుమతి ఇచ్చింది.
వాటిల్లో
1.మహేంద్ర(బహుదూర్‌పల్లి),
2.వోక్సన్(సదాశివపేట),
3.మల్లారెడ్డి(మైసమ్మగూడ, దూలపల్లి),
4.ఎస్‌ఆర్(అనంతసాగర్, వరంగల్),
5.అనురాగ్ విశ్వవిద్యాలయం(వెంకటాపూర్, ఘట్‌కేసర్) ఉన్నాయి.
గురునానక్(ఇబ్రహీంపట్నం), ఎంఎన్‌ఆర్ వైద్య విశ్వవిద్యాలయం(సంగారెడ్డి), శ్రీనిధి(ఘట్‌కేసర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్(నిక్మార్-శామీర్‌పేట)లకు ఫిబ్రవరిలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చినా ప్రస్తుతం అనుమతి లభించలేదు. వాగ్దేవి, విజ్ఞాన్ గ్రూపు, అమిటీ, రాడ్‌క్లిప్ తదితర విద్యాసంస్థలూ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వాటిల్లో ఉన్నాయి.
జేఈఈ లేదా ఎంసెట్ ఆధారంగా ప్రవేశాలు
ప్రస్తుతం అనుమతి దక్కిన అయిదు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే విద్యాసంస్థలను నడుపుతున్నాయి. అందులో నాలుగు అంతకుముందు ఉన్న కళాశాలలను వర్సిటీలుగా మారుస్తుండగా.. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం మాత్రం కొత్తది. తొలుత అది మహిళా విశ్వవిద్యాలయంగా అనుమతి తెచ్చుకున్నా తర్వాత జనరల్ వర్సిటీగా మారింది. ఇప్పటికే మల్లారెడ్డి గ్రూపునకు ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో కొంత స్థలాన్ని కేటాయించి కొత్తగా విశ్వవిద్యాలయం(గ్రీన్‌ఫీల్డ్) నెలకొల్పుతోంది. వోక్సన్ సంస్థ ఆర్కిటెక్చర్, డిజైన్ లాంటి కోర్సులను నిర్వహిస్తుండగా ఇకపై ఇంజినీరింగ్ సహా మరిన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. టెక్ మహేంద్ర గ్రూపు దశాబ్దం నుంచే జేఎన్‌టీయూహెచ్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది. హైదరాబాద్ శివారులో ఉన్న అనురాగ్ కళాశాల, వరంగల్‌లోని ఎస్‌ఆర్ సంస్థలు ఇంజినీరింగ్ కళాశాలలను నడుపుతున్నాయి. విద్యా సంవత్సరం(2020-21)లోనే ఈ వర్సిటీలన్నీ తరగతులను ప్రారంభించనున్నాయి. జేఈఈ మెయిన్ లేదా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
25 శాతం స్థానికులకు సీట్లు
తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం(2018) ప్రకారం మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను స్థానికులకు కేటాయించాలి. అంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలి. స్థానికులుగా పరిగణించాలంటే రాష్ట్రంలో రెండేళ్లు చదివితే చాలు. ఇంటర్మీడియట్ చదివినా స్థానిక కోటా కింద సీట్లు పొందొచ్చు. ఫీజు విషయంలో మాత్రం ఎటువంటి రాయితీలు ఉండవు.