అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశానికీ పాలిసెట్
ఈసారి పది మార్కులు, గ్రేడ్లు ప్రామాణికం కాదు
పాలిసెట్ ర్యాంకులే ఆధారం
డిమాండ్ బాగా ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని రెండేళ్ల అగ్రికల్చర్ డిప్లొమా, మూడేళ్ల అగ్రికల్చర్ డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సులకు పదో తరగతి మార్కులు/గ్రేడ్లు కాకుండా ఇక నుంచి పాలిసెట్ ర్యాంకే ప్రామాణికం. వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21)ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాష్ట్ర విద్యాసాంకేతిక, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్) ఆధ్వర్యంలో నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పాలిసెట్) రాయాల్సిందే. కొన్ని బోర్డులు మార్కులు, మరికొన్ని గ్రేడ్లు ఇస్తుండటంతో మెరిట్ చూడటం సమస్యగా మారుతోందని వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.
పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటివరకు మొత్తం 36 వేల దరఖాస్తులు అందగా...అందులో 8 వేలు అగ్రికల్చర్ డిప్లొమా కోసం అందాయి.
ఇవీ ముఖ్యాంశాలు
- కోర్సులు: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్. ఇవి రెండేళ్ల కోర్సులు. ఇక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ మూడేళ్ల కోర్సు. మొత్తం 870 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- 120 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. సమయం 2.30 గంటలు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కోర్సుల వారికి గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలు, వ్యవసాయ డిప్లొమా వారికి వాటితోపాటు జీవశాస్త్రం ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.
- పదో తరగతి పరీక్షల కాలపట్టిక వచ్చిన తర్వాత పాలిసెట్ జరిగే తేదీని ప్రకటిస్తారు.