11 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం... 30 రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు..


ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 11న ప్రారంభం కానుంది. అందుకు అవసరమైన కోడింగ్‌ ప్రక్రియ గురువారం మొదలవుతుంది. ముందుగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జవాబుపత్రాలను దిద్దుతారు. ఫలితాల వెల్లడికి సుమారు 25-30 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇంటర్‌ మూల్యాంకనానికి ఆమోదం లభించడంతో ఆ ప్రక్రియ ప్రారంభించడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ బుధవారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌, కంట్రోలర్‌ ఖాలిక్‌, ఇతర అధికారులతో సమీక్షించారు. డీఐఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 7 నుంచి ఓఎంఆర్‌ పత్రంలోని మూడు భాగాల్లో విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్లు తదితర వివరాలతో కూడిన మొదటి భాగాన్ని చించి రహస్యంగా భద్రపరిచే కోడింగ్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గతంలోనే ఈ ప్రక్రియ 70-80 శాతం పూర్తికాగా మిగిలిన దాన్ని ప్రస్తుతం పూర్తి చేస్తారు. అనంతరం ఈ నెల 11 నుంచి.. ఒకవేళ ఆలస్యమైతే 12 నుంచి మూల్యాంకనాన్ని మొదలుపెడతారు.  కాగా, కరోనా ప్రబలిన ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యాపకులు అందరూ ఇంటర్‌ మూల్యాంకనంలో పాల్గొనాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

ఇవీ నిర్ణయాలు

  • ప్రస్తుతం 12 చోట్ల మూల్యాంకన కేంద్రాలు ఉండగా వాటికి అనుబంధంగా మరో 21 చోట్ల పాఠశాలలు/కళాశాలల్లో కూడా మూల్యాంకనం చేస్తారు. వ్యక్తిగత దూరం పాటించాల్సి ఉండటంతో అదనపు కేంద్రాల అవసరం ఏర్పడింది.


  • ఒక్కో గదికి 12 మంది మించకుండా అధ్యాపకులను ఉంచుతారు. ఒక్కో అధ్యాపకుడికి ఉతికి మళ్లీ ఉపయోగించుకునే మూడు మాస్కులతో పాటు గ్లౌజులు ఇస్తారు.


  • అధ్యాపకులకు స్పాట్‌ కేంద్రంలోనే భోజన వసతి కల్పిస్తారు.


  • ఇతర జిల్లాల నుంచి వచ్చే అధ్యాపకులకు రాత్రి బస సదుపాయం కల్పిస్తారు.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28