ఒకేసారి రెండు డిగ్రీలు ప్రతిపాదనకు యూజీసీ గ్రీన్‌సిగ్నల్‌..


త్వరలో నోటిఫికేషన్‌ జారీ
ఒకటి రెగ్యులర్, రెండోది డిస్టెన్స్‌ విధానంలో అనుమతి


 దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అనుమతించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కమిషన్‌ ఆమోదించింది. త్వరలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇకపై దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. అయితే రెండూ ఒకేసారి రెగ్యులర్‌ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్‌లైన్లో దూరవిద్య(ఓఎల్‌డీ) ద్వారా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.

  • ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని యూజీసీ అభిప్రాయపడింది.
  •  కొత్త విధానంలో విద్యార్థులు ఒకే సంస్థ లేదా వేర్వేరు సంస్థల ద్వారా ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను అభ్యసించగలుగుతారు. ఈ మేరకు యూజీసీ అనుమతి ఇచ్చిందని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏకకాలంలో ద్వంద్వ డిగ్రీల కోసం వచ్చిన ప్రతిపాదనను ఇటీవల జరిగిన కమిషన్‌ సమావేశంలో ఆమోదించారని చెప్పారు.
  • దీనికి సంబంధించి త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
  • ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకువచ్చింది. ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్‌ చాన్స్‌లర్‌ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది.
  • రెగ్యులర్‌ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్‌ లేదా డిస్టెన్స్‌ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ  సిఫారసు చేసింది. రెగ్యులర్‌ మోడ్‌లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనా పరంగా వీలుకాదని అభిప్రాయపడింది.
  • ఈ కమిటీ నివేదికపై నిపుణులతో కూడిన చట్టబద్ధమైన అకడమిక్‌ కౌన్సిల్స్‌ అభిప్రాయం యూజీసీ కోరింది. అప్పటి కౌన్సిల్‌ సూచనల మేరకు బహుళ డిగ్రీ కార్యక్రమాలను యూజీసీ ఆమోదించలేదు.
  • ప్రస్తుతం మారుతున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, పెరుగుతున్న పోటీతత్వంతో విద్యార్థులు వాటిని ఎదుర్కొనాలంటే పరిజ్ఞానం మరింత అవసరమని భావించి ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది.


Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28