హాస్టళ్లు తెరవకుండా పరీక్షలు కష్టం
- దాదాపు లక్షన్నర మంది డిగ్రీ విద్యార్థులు వసతిగృహాల్లో వారే
- ఒకేసారి మూడేళ్ల పరీక్షలు వద్దని ఉన్నత విద్యామండలికి ప్రవీణ్‌కుమార్ లేఖ
డిగ్రీ పరీక్షలు నిర్వహించాలంటే కచ్చితంగా హాస్టళ్లు తెరవాల్సి ఉంటుందని, లేకుంటే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాల పరిధిలో దాదాపు 5.50 లక్షల మంది డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వారిలో సుమారు లక్షన్నర మంది ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారని అధికారుల అంచనా. ప్రభుత్వ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు 52 ఉండగా వాటిలో సుమారు 20 వేల మంది ఉన్నారు. మిగిలిన వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, ఇతర ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటారని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. అందువల్ల హాస్టళ్లు తెరవకుండా డిగ్రీ పరీక్షలు జరపడం కష్టమేనన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ సైతం ఒకేసారి డిగ్రీ మూడేళ్ల పరీక్షలు పెడితే రెసిడెన్షియల్ కళాశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ నిర్వహణ కష్టమని, విడతలవారీగా పరీక్షలు పెట్టాలని ఉన్నత విద్యామండలిని ఓ లేఖలో కోరారు.
బ్యాక్‌లాగ్ పరీక్షలు ఎలా?
ముందుగా డిగ్రీ చివరి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించినా దానివల్ల ప్రయోజనం పొందేవారు తక్కువ మంది ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు అయిదు సెమిస్టర్లలో సబ్జెక్టులు తప్పని వారు కేవలం 20 శాతం లోపే ఉంటారని, అందువల్ల వారికి బ్యాక్‌లాగ్ (తప్పిన) సబ్జెక్టుల్లో కూడా సాధ్యమైనంత త్వరగా పరీక్షలు జరిపితేనే వారు పీజీ చదివేందుకు అర్హత పొందుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
షిఫ్టు పద్ధతిలో: ఓయూ నిర్ణయం
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను షిఫ్టు పద్ధతిలో నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు యోచన చేస్తోంది. ఇప్పటికే డిగ్రీలోని 2, 4, 6 సెమిస్టర్లతోపాటు మిగిలిన సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల నోటిఫికేషన్‌ను వర్సిటీ పరీక్షల విభాగం విడుదల చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే జులైలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించి పరీక్ష రాయడం శ్రేయస్కరం కాదని, వారు చదివే కళాశాలకు 5 కిలోమీటర్ల పరిధిలోపే పరీక్ష కేంద్రం కేటాయించాలని ప్రైవేటు కళాశాలల సంఘం ప్రతినిధులు వర్సిటీకి చేసిన ప్రతిపాదనను వర్సిటీ సానుకూలంగా పరిశీలిస్తోంది.