ఇంటర్ ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లో దోస్త్ నోటిఫికేషన్.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజుల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఇంటర్ ఫలితాల ఆన్‌లైన్ మార్కుల మెమో కింది భాగంలో దోస్త్ నుంచి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు దోస్త్ ఆహ్వానం పలికే విధంగా ప్రకటన ఉండనుంది.

ఫలితాల వెల్లడి తర్వాత వెంటనే దోస్త్ నోటిఫికేషన్ జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ రెండవ వారంలో ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ మూడవ వారంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సారి నో బయోమెట్రిక్
కరోనా నేపథ్యంలో ఈ సారి బయోమెట్రిక్ లేకుండా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూన్ మూడవ వారం లేదా చివరి వారంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసి జూలై, ఆగస్టులో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసేలా దోస్త్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దోస్త్ నోటిఫికేషన్, విధివిధానాలపై రెండు మూడు రోజుల్లో సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.

ఈ నెలాఖరు వరకు దోస్త్ షెడ్యూల్ విడుదలపై పూర్తి స్పష్టత రానుంది. రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సుమారు 4 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. అందులో 1.80 లక్షల మంది దోస్త్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పలు మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)