10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్
టెన్త్ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించడానికే సిద్ధమైతే మరి కంటైన్మెంట్ జోన్లలో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పరిస్థితేంటని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాసుకోలేకపోయిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. మరి సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించిన హై కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హై కోర్టు ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు సమాధానం చెబుతామని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ కోర్టుకు తెలిపారు.
ఎస్.ఎస్.సి ఎగ్జామ్స్ రీషెడ్యూల్ ప్రకారం జూన్ 8 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే మధ్యలో ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ పరీక్షల నిర్వహణ అంశం ఇంకా కోర్టులోనే నానుతుండటంపై విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. అసలు పరీక్షలు ఉన్నట్టా వాయిదా పడినట్టా అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి. ఈ సందేహాలకు తెరపడాలంటే రేపు హై కోర్టు ఏం చెప్పనుందో వేచిచూడాల్సిందే మరి.