విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెమిస్టర్ పరీక్షలు
- కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్‌లు
- పరీక్ష సమయం 2 గంటలకు కుదింపు
- జూన్ 20 తర్వాత నిర్వహణ
- ఉన్నత విద్యా మండలి, రిజిస్ట్రార్ల సమావేశంలో చర్చ
రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు కామన్ పేపర్‌తో ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నలతో పరీక్ష ప్రశ్న పత్రాలు రూపొందించే అంశాల పై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల పరీక్షలు, విద్యా కార్యక్రమాలపై జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పలు యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
యూజీసీ మార్గదర్శకాల జారీ కంటే ముందుగానే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, మార్కులతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు యూనివర్సిటీలు కూడా సిద్ధం కావాలని పేర్కొంది.
యూనివర్సిటీ స్థాయిలోనూ పరీక్షల విభాగం నియంత్రణాధికారులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలతో చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని పాపిరెడ్డి ఆదేశించారు. నాలుగు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని, అందులో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో తాము తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించాలని నిర్ణయించారు.
త్వరలోనే నిర్ణయం..
వీలైతే జూన్ 20 నుంచి లేకపోతే జూలై 1 నుంచి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. మిగతా సెమిస్టర్‌ల వారికి జూలై 15 నుంచి నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించాలా.. యూజీసీ చెప్పినట్లు కిందటి సెమిస్టర్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలా.. అన్న దానిపై త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటలు నుంచి 2 గంటలకు కుదించాలనే యోచనలో ఉంది.