కరోనా ఎఫెక్ట్.. వచ్చే విద్యా సంవత్సరం ఆలస్యం, రెండో శనివారం సెలవులు రద్దు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు మూసేశారు. స్కూల్స్, కాలేజీలు బంద్ అయ్యాయి. ఇంకా ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. ఇంతలోనే కరోనా కారణంగా అన్నీ మూతబడ్డాయి. కరోనా ప్రభావం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంపై పడింది. వచ్చే విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానుంది.

జూన్, జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు:

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్, ఉన్నత విద్యలో రెండో శనివారం సెలవులు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా కారణంగా జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు విద్యాశాఖ ఈ విధానాన్ని అమలు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పాఠశాల విద్యాశాఖ టెన్త్‌ పరీక్షలను పూర్తి చేయలేదు. మరోవైపు ఇంటర్‌ ఫలితాలు వెలువడలేదు. డిగ్రీ పరీక్షలు నిర్వహించలేదు. లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ ముగిశాక విద్యా కార్యక్రమాలు చేపట్టినా జూన్, జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైతే పని దినాలను, సెమిస్టర్‌ విధానాన్ని సర్దుబాటు చేసేందుకు రెండో శనివారం సెలవులు రద్దు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

వచ్చే విద్యా సంవత్సరం ఆలస్యం తప్పదు:

మార్చి 19న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మూడు పేపర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 8 పేపర్లు నిర్వహించాల్సి ఉంది. కరోనా ప్రభావంతో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్మీయట్‌ ప్రధాన పరీక్షల వాల్యుయేషన్ పూర్తి కాలేదు. మార్చిలో నిర్వహించాల్సిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా అదుపులోకి వస్తే వీటిని నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే ఇంకా కొన్నాళ్లు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. మేలో పదో తరగతి పరీక్షలను నిర్వహించి వాటి వాల్యుయేషన్(మూల్యాంకనం) పూర్తి చేసి, ఫలితాలు ఇచ్చేటప్పటికి జూన్‌ రెండో వారం వస్తుంది. అప్పుడు ఇంటర్ ప్రవేశాలు చేపట్టి తరగతులు మొదలుపెట్టేసరికి జూలై వచ్చేస్తుంది. దీంతో ఇంటర్ విద్యా సంవత్సరంలో ఆలస్యం తప్పదు.

పనిదినాల సర్దుబాటు కోసం సెలవులు రద్దు:

ఇక ఆ తర్వాత కాలేజీల పని దినాలు సర్దుబాటు చేసేందుకు రెండు శనివారం సెలవులను రద్దు చేయకతప్పని పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇంటర్ వాల్యుయేషన్ పూర్తి చేసి, డిగ్రీ, ఇంజనీరింగ్‌ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇంకా సమయం పట్టనుంది. పైగా ఆయా కాలేజీల అఫీలియేషన్లు పూర్తి చేయడంలో ఆలస్యం తప్పదు. ఈ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు ఇప్పటికీ డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి కాలేదు. మే లో ఈ పరీక్షలను నిర్వహించి, ఫలితాలను జూలై నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టినా విద్యా సంవత్సరంలో ఆలస్యం తప్పదు.

మొత్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ అన్ని రంగాలపైనా ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రపంచ దేశాలు ఆర్థిక పరిస్థితి మాంద్యంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. పెద్ద సంఖ్యలో కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు ఊడాయి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)