తెలంగాణలో మే 7వరకూ లాక్‌డౌన్: సీఎం కేసీఆర్


  • గత నెల మాదిరిగా ఉద్యోగులకు జీతాలు
  • పోలీసులకు 10% జీతం ప్రోత్సాహకం
  • పెన్షనర్లకు 75% పెన్షన్


 ♦తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉండవని సీఎం ప్రకటించారు. కేబినెట్‌లో చర్చించిన అనంతరం ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అయితే.. రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపుపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

♦లాక్‌డౌన్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలే మే 7వరకూ కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ లాక్‌డౌన్ పొడిగింపుపై సర్వే చేశామని, పలు మీడియా సంస్థలు కూడా సర్వే చేశాయని సీఎం చెప్పారు. అభిప్రాయ సేకరణ అనంతరం కేబినెట్‌లో చర్చించాక మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు

♦తెలంగాణలో మూడు నెలలపాటు ఇంటి అద్దెలు వసూలు చేయొద్దని ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ 3నెలల కిరాయి వడ్డీలేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించొచ్చని సీఎం చెప్పారు. కిరాయి కోసం ఓనర్లు ఇబ్బంది పెడితే డయల్‌ 100కు ఫిర్యాదు చేయండి అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

♦ప్రైవేట్‌ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచకూడదు. నెలవారీగా మాత్రమే ట్యూషన్‌ ఫీజులు వసూలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం. ట్యూషన్‌ ఫీజు కాకుండా ఎలాంటి ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు. 2020-21 ఏడాదికి విద్యా సంస్థల్లో ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచకూడదు.  ఫీజులు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టకూడదు.ఫీజుల కోసం ఎవరైనా ఇబ్బందిపెడితే డయల్‌ 100కి ఫోన్‌ చేయండి.  ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. 

♦ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 30 వరకు ఆస్తిపన్ను చెల్లించొచ్చు. మే నెలలో కూడా ప్రతి తెల్ల రేషన్‌ కార్డుదారుడికి 12 కిలోల బియ్యం,  కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు సాయం అందిస్తామని' సీఎం వివరించారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం