సెట్స్’ గడువు మళ్లీ పెంపు
- మే 15 వరకు పొడిగించిన ఉన్నత విద్యామండలి
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువును మరోసారి ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎంసెట్ సహా అన్ని సెట్స్ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు, ఇంటర్నెట్ సెంటర్లు బంద్ కావడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో దరఖాస్తుల గడువును మొదట మే 7 వరకు పొడిగించగా మే 7 తరువాత కూడా లాక్‌డౌన్ ఎత్తేసే పరిస్థితి కనిపించని నేపథ్యంలో మే 15 వరకు దరఖాస్తుల గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మరోవైపు మే 15 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినా పరీక్షల నిర్వహణకు అవసరమైన కేంద్రాల గుర్తింపు, నిర్వహణ సంస్థ చేయాల్సిన ఆన్‌లైన్ పరీక్షల ఏర్పాట్లకు సమయం పట్టనుంది. అలాగే విద్యార్థుల ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాల్సి వస్తుంది. పైగా హాస్టళ్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లో దరఖాస్తుల గడువు ముగిసి మే 2న ఈసెట్, 5 నుంచి ఎంసెట్ ఆ తర్వాత నుంచి ఇతర సెట్స్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.
- పరీక్షల షెడ్యూల్ సిద్ధం చేస్తున్నాం: పాపిరెడ్డి
ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 10 నుంచి ప్రవేశపరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వివరించారు. జూన్ నెలాఖరు లేదా జూలై రెండో వారంలోగా ఎంట్రన్స్‌లు పూర్తి చేస్తామన్నారు. జూన్ నెలాఖరులో లేదా జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
source : సాక్షి