తెలంగాణ అవతరణ దినోత్సవం: విలీనం నుంచి విభజన దాకా...


నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆంకాంక్ష నెరవేరింది.
ఆంధ్రతో హైదరాబాద్ ప్రాంతం విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

1948: నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) పోలీస్ చర్య‌తో భారత్‌లో విలీనం అయింది. అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది.

1956: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది. పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్ మెన్ అగ్రిమెంట్)తో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

1969: పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. పోలీసుల కాల్పుల్లో 300 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు.

1973: ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాటి ప్రధాన మంత్రి ఇంధిరా గాంధీ ఆరు సూత్రాల పథకాన్ని (సిక్స్ పాయింట్ ఫార్ములా) ప్రతిపాదించారు. దీనికి ఆంధ్రా, తెలంగాణ నేతలు అంగీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి.

2001: తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ శాసన సభ్యుడు కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు.
శ్రీకాంతాచారి

2009: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంత చారి ఆత్మబలిదానం చేసుకున్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న కేంద్రం ప్రకటించింది.

2010: తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది.

2011, 2012 : శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇరుప్రాంతాలను సంతృప్తి పరచలేకపోయింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు కలసి మిలియన్ మార్చ్, సాగర హారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశారు.

2013: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం